|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 08:08 PM
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన కూతురి పట్ల చూపించిన కర్కశత్వం మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉంది. కేవలం 1 నుంచి 50 వరకు అంకెలు లెక్కించలేదనే కోపంతో.. తన నాలుగు ఏళ్ల పసికందును ఆ కసాయి తండ్రి రోకలి బండతో కొట్టి చంపేశాడు. ఫరీదాబాద్ జిల్లా ఝార్సెంటలీ గ్రామంలో జనవరి 21వ తేదీన ఈ దారుణం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్, ఆమె భార్య ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 7 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కృష్ణ జైస్వాల్ తన కూతురికి ఇంట్లోనే పాఠాలు చెబుతుండేవాడు. ఆ రోజు చిన్నారిని 1 నుంచి 50 వరకు అంకెలు లెక్కించమని అడిగాడు. ఆ పాప చెప్పలేకపోయేసరికి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కృష్ణ జైస్వాల్.. ఇంట్లోని రోకలి బండతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో చిన్నారి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తన భార్యకు ఫోన్ చేసి.. పాప ఆడుకుంటూ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని అబద్ధం చెప్పి ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆస్పత్రికి వచ్చిన భార్య.. పాప శరీరంపై ఉన్న గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేసింది. ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసుల విచారణలో కృష్ణ జైస్వాల్ తన నేరాన్ని అంగీకరించాడు. పాప స్కూల్‌కు వెళ్లడం లేదని.. తాను ఇంట్లోనే చదువు నేర్పిస్తున్నానని.. కానీ ఆమె అంకెలు సరిగ్గా చెప్పకపోవడంతో కోపం వచ్చి కొట్టానని వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులకు బాధితురాలితో పాటు ఒక 7 ఏళ్ల కుమారుడు.. 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
Latest News