|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:13 PM
అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రస్తుతం ఉన్న 50 శాతం సుంకాలను సగానికి తగ్గించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలోని కీలక అధికారి ఒకరు సూచించారు. కొన్ని నెలల క్రితం ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై మొదట 25 శాతం టారిఫ్‌లు వేశారు. ఇక రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాలు వేశారు. దీంతో అప్పటి నుంచి భారత్, అమెరికా మధ్య ఈ వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలపై ప్రతిష్ఠంభన వీడకపోవడంతో.. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్.. గతంలో భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించే మార్గం సుగమమైందని అభిప్రాయపడ్డారు. 2025 ఆగస్టులో రష్యాతో ఇంధన సంబంధాల కారణంగా ట్రంప్ భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచారు. ఇప్పుడు దానిని 25 శాతానికి తగ్గించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
రష్యా చమురు కొనుగోళ్లు
భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించాయని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల తాము 25 శాతం అదనపు సుంకాలను విధించామని తెలిపారు. ఇప్పుడు రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లు కుప్పకూలాయని.. ఇది తమ విజయమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటన భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయన్న ఆశలను మరింత పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేయకపోవడం వల్ల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందని అంతకుముందు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్.. చేసిన వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే కొత్త రాయబారి సెర్గియో గోర్ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని ధృవీకరించారు.
ట్రంప్, బెసెంట్ ఇద్దరూ భారత్.. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందని చెబుతున్నప్పటికీ.. దీన్ని భారత్ మాత్రం అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. 2025 అక్టోబర్‌లో ట్రంప్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కొట్టివేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయితే.. అమెరికా ఒత్తిడి, ఆర్థిక ఆంక్షల ప్రభావం వల్ల భారత్ క్రమంగా రష్యా చమురుపై ఆధారపడటం తగ్గించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News