|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:19 PM
ధోనీ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. మళ్లీ మాహీ బాయ్ ఎప్పుడు మైదానంలోకి దిగిపోయి బ్యాట్ పట్టుకుంటాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు తాజాగా తెరదిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ధోనీ అభిమానులకు ఐపీఎల్ అంటే ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే ఈ ఏడాదిలో ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నది ఐపీఎల్ ద్వారానే. అందుకే ఇప్పటి నుంచే మాహీ ఫ్యాన్స్ టోర్నమెంట్ ప్రారంభం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ధోనీ తన స్వస్థలం రాంచీలో 2026 ఐపీఎల్ సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గత సీజన్‌లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తదుపరి సీజన్‌లో కూడా ధోనీ జట్టుకు అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు ధోనీ స్వయంగా మైదానంలోకి దిగి ప్రాక్టీస్ చేయడం ద్వారా తన రీటర్న్‌ను సూచనల రూపంలో తెలియజేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాంచీ స్టేడియంలోని నెట్స్‌లో తీసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ధోనీ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. సీఎస్‌కేకు చెందిన పసుపు రంగు ప్యాడ్స్ ధరించిన ధోనీ, తన కొత్త బ్యాట్‌ను బయటకు తీస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. అతనితో పాటు జార్ఖండ్ క్రికెట్‌కు చెందిన జూనియర్, భారత మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ కూడా ప్రాక్టీస్‌కు సిద్ధమవుతూ కనిపించాడు. ప్రస్తుతం సౌరభ్ తివారీ JSCAలో అధికారిగా ఉన్న విషయం గమనార్హం.
ధోనీకిదే చివరి సీజనా..? ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇది ధోనీకిది చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై స్పష్టత రావాలంటే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26న ప్రారంభమై మే 31 వరకు జరగనుంది. అయితే పూర్తి షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.