|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 07:39 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ఐదు మందికి పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి.
ఏపీలో జన్మించిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రవాస భారతీయుడి కింద పద్మ భూషణ్ పురస్కారం వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ శ్రీ పురస్కారాలు వరించగా..అందులో ఏపీ నుంచి నలుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీ మోహన్, తరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించారు.
రాజేంద్ర ప్రసాద్ (కళారంగం)
మురళీ మోహన్ ( కళారంగం)
వెంపటి కుటుంబ శాస్త్రి ( సాహిత్యం)
తరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు)
నోరి దత్తాత్రేయుడు 1947 అక్టోబర్ 21వ తేదీ కృష్ణా జిల్లామంటాడలో జన్మించారు. 12 మంది సంతానంలో నోరి దత్తాత్రేయుడు చివరి వ్యక్తి. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. 1965-71 మధ్యకాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు.1976లో హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో రేడియోథెరపీలో ఎం.డి పట్టా పొందారు.1972 నుంచి ఓ సంవత్సరం పాటు.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పనిచేశారు. 1973 నుంచి 1976 సంవత్సరం వరకూ.. హైదరాబాద్‌లో ఉన్న రేడియం ఇన్‌స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్‌లో పనిచేశారు.1976లో అమెరికా వెళ్లిన నోరి దత్తాత్రేయుడు.. న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో చేరారు.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు బ్రాకీథెరపీ అనే క్యాన్సర్ చికిత్సా విధానంలో నిష్ణాతులుగా పేరుపొందారు. 1979 నుంచి ఈ విధానం ద్వారా ఎంతోమందికి ప్రాణం పోశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2014లో అమెరికాలో ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. తాజాగా కేంద్రం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. అమెరికాలో స్థిరపడిన ఆయనకు ప్రవాస భారతీయుడి కింద అవార్డు ప్రకటించింది.
Latest News