|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:24 PM
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్, 26 ఏళ్ల సిమ్రన్ బాలా..కేవలం పురుషులతో కూడిన సైనిక దళానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. గణతంత్ర వేడుకల చరిత్రలో ఒక పారామిలిటరీ దళానికి చెందిన 147 మంది పురుష సిబ్బంది బృందానికి ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
సీఆర్‌పీఎఫ్ గీతం దేశ్ కే హమ్ హై రక్షక్ ధ్వనుల మధ్య సిమ్రన్ బాలా .. తన సీఆర్‌పీఎఫ్ దళాన్ని ముందుండి నడిపించారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని.. నౌషెరా గ్రామానికి చెందిన సిమ్రన్ బాలా.. ఆ జిల్లా నుంచి సీఆర్‌పీఎఫ్‌లో ఆఫీసర్ హోదా పొందిన మొదటి మహిళగా కూడా గుర్తింపు పొందారు. సిమ్రన్ బాలా కుటుంబ సభ్యులకు కూడా సైనిక నేపథ్యం ఉంది. సిమ్రన్ బాలా తండ్రి, తాత ఇద్దరు కూడా భారత సైన్యంలో దేశానికి సేవలు అందించారు.
జమ్మూలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో సిమ్రన్ బాలా పట్టభద్రురాలు అయ్యారు. 2025 ఏప్రిల్‌లో సీఆర్‌పీఎఫ్‌లో చేరిన సిమ్రన్ బాలా.. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే బస్తారియా బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.