|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 08:15 PM
మినియాపొలిస్‌లో అమెరికా పౌరుడు ఎలెక్స్ జెఫ్రీ ప్రెట్టీ (37)ని ఫెడరల్ అధికారులు నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) చెప్పినదానికి ఈ వీడియో విరుద్ధంగా ఉంది. ప్రెట్టీని ఫెడరల్ ఏజెంట్లు కింద పడేసి, అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్న తర్వాతే కాల్చి చంపినట్లు వీడియోలో కనిపిస్తోంది. అమెరికా మీడియా సంస్థలు విశ్లేషించిన ఫోన్ ద్వారా తీసినట్లుగా ఉన్న ఈ వీడియోలో.. సుమారు ఎనిమిది మంది ఏజెంట్లు ప్రెట్టిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో ప్రెట్టి వద్ద 9 mm సెమీ-ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ ఉందని గుర్తించి, అతడి నడుము వద్ద ఉన్న దానిని ఓ ఏజెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే దాదాపు 10 రౌండ్లు పేలినట్లుగా వీడియోలో ఉంది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు.
ప్రెట్టి వద్ద ఆయుధం లేదని ఇతర ఏజెంట్లకు తెలుసా? లేదా? అనేది వీడియోలో స్పష్టంగా లేదు. స్థానిక అధికారుల ప్రకారం.. ప్రెట్టికి తుపాకీ లైసెన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం.. ప్రెట్జి తమ వైపు దూసుకురావడంతో ఆత్మరక్షణ కోసం ఏజెంట్లు కాల్పులు జరిపారని పేర్కొంది. అయితే, మరో వీడియోలో ప్రెట్టి చేతిలో కేవలం ఫోన్ మాత్రమే ఉందని, అతడు ఒక ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, ఒక మహిళ మధ్యలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అతడు ఆయుధంతో ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు.
కాల్పుల తర్వాత, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్.. ప్రెట్టి అధికారులపై దాడి చేశాడని ఆరోపించారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్న బోర్డర్ పెట్రోల్ సీనియర్ అధికారి గ్రెగ్ బోవినో.. చట్టాన్ని అమలు చేసేవారిని ప్రెట్టి ఊచకోత కోయాలనుకున్నాడని అన్నారు.
నికోలెట్ అవెన్యూలో ఏజెంట్లు మరొక వ్యక్తిని టార్గెట్ చేసి ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ప్రెట్టిని ఎదుర్కొన్నారని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ‘ఒక వ్యక్తి 9 mm సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్‌తో US బోర్డర్ పెట్రోల్ అధికారుల వద్దకు వచ్చాడు.. తన చుట్టూ ఉన్న సహోద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని భయపడిన ఒక ఏజెంట్ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు’ అని నోయెమ్ పేర్కొన్నారు.
మూడు వారాల్లోనే జరిగిన మూడో ఘటన ఇది. అధికారులపై ప్రెట్టి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా కొడుకు గురించి ట్రంప్ యంత్రాంగం చెప్పిన అసహ్యకరమైన అబద్ధాలు ఖండించదగినవి.. ట్రంప్ హత్య చేసే, పిరికి గుండాల దాడికి గురైనప్పుడు అలెక్స్ స్పష్టంగా తుపాకీ పట్టుకోలేదు. అతడి కుడి చేతిలో ఫోన్ ఉంది.. ఎడమ చేయి ఖాళీగా ఉంది. పెప్పర్ స్ప్రే చేస్తుండగా ఫెడరల్ ఏజెంట్లు కింద పడేసి మహిళను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు’ అని కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. దయచేసి తమ కుమారుడి గురించి నిజం బయటపెట్టండని అభ్యర్థించారు.
Latest News