|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 08:26 PM
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇద్దరూ కలిసే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అంతేనా పెళ్లి రోజు ఇందుకు సంబంధించిన ప్రమాణాలు కూడా చేయిస్తుంటారు. కానీ ఆ ప్రమాణాలు మరిచిన ఓ భర్త.. భార్యకు అనారోగ్యం రాగానే ముఖం చాటేశాడు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల లీ అనే మహిళకు ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి కారణం అవుతోంది. చర్మ వ్యాధి కారణంగా ఆమె జుట్టు రాలిపోయి, బట్టతల రావడంతో.. ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి పంపేశాడు.
కుటుంబమే లోకంగా బ్రతికినా తప్పని అవమానం
లీ గత 16 ఏళ్లుగా తన భర్త, పిల్లల కోసం అహర్నిశలు శ్రమించింది. ఇంటి పనులు, వంట, పిల్లల పెంపకం.. ఇలా ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకుంది. అయితే రెండేళ్ల క్రితం ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆమె జుట్టు ఒక్కసారిగా తెల్లబడటం ప్రారంభమై.. క్రమంగా ఊడిపోతూ బట్టతల వచ్చేలా చేసింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు విటిలిగో అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.
రోగానికంటే భర్త ప్రవర్తనతోనే ఎక్కువ బాధ..
లీ పరిస్థితిని చూసి జాలిపడాల్సింది పోయి.. ఆమె భర్త ఆమెను అసహ్యించుకోవడం మొదలు పెట్టాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గానీ, కనీసం ఆమె ఆరోగ్యం గురించి అడగడానికి గానీ అతను ఇష్టపడలేదు. పైగా ఆమె వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి చుట్టాల శుభకార్యాలకు కూడా ఆమెను తీసుకువెళ్లడం మానేశాడు. బయట పిల్లలు ఆమెను చూసి వింత పేర్లతో వెక్కిరిస్తున్నా, భర్త నుంచి ఆమెకు ఎలాంటి మద్దతు లభించలేదు. మెడికల్ బిల్లులు కట్టడం ఇష్టం లేక.. ఆమెను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు.
లీకి ఉన్న ప్రారంభంలో సమస్య స్వల్పంగానే ఉండేది. కానీ భర్త చూపిన నిర్లక్ష్యం, నిత్యం గొడవలు, మానసిక ఆందోళన వల్ల ఆ వ్యాధి మరింత ముదిరిపోయింది. విటిలిగో వ్యాధిని అదుపు చేయాలంటే ప్రశాంతమైన మనస్తత్వం చాలా అవసరమని, కానీ లీ విషయంలో అది సాధ్య పడలేదని జెంగ్‌జౌ ల్యూకోడెర్మా ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. చివరకు ఆమె భర్త విడాకుల ప్రతిపాదన పెట్టగా.. చేసేదేమీ లేక లీ అంగీకరించింది. 16 ఏళ్ల సంసారం అర్థాంతరంగా ముగియడమే కాకుండా కోర్టు బిడ్డ కస్టడీని కూడా భర్తకే అప్పగించింది. దీంతో "అతనిలాంటి కఠిన హృదయుడిని నేను ఎక్కడా చూడలేదు" అని లీ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. "అందం తాత్కాలికం, కానీ భార్యపై చూపాల్సిన ప్రేమ శాశ్వతం.. ఆమె భర్త చేసిన పని క్షమించరానిది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Latest News