|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:14 PM
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సహకారం లభిస్తోంది. 2024లో బడ్జెట్ సందర్భంగా కూడా కేంద్రం అమరావతికి వరాలు ప్రకటించింది. అమరావతికి రూ.15000 కోట్లు ఇస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి వివిధ రకాలుగా అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తోంది. అయితే 2026-27 బడ్జెట్ సమయం దగ్గర పడటంతో ఏపీకి, అందులోనూ అమరావతికి ఈసారి ఎలాంటి వరాలను కేంద్రం ప్రకటిస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ అఖిల పక్ష భేటీకి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. భేటీ అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.
అలాగే 16 ఏళ్లలోపు పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా రాజకీయ నేతలు 30 రోజులు జైళ్లో ఉంటే పదవి కోల్పోయే బిల్లు గురించి చర్చించాలని కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఎక్కువ నిధులు కేటాయింపు, నదుల అనుసంధానం గురించి అఖిలపక్ష భేటీలో చర్చించినట్లు వివరించారు.
మరోవైపు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటే.. విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈ సవరణకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం.. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతిని పేర్కొంటూ గెజిట్ విడుదల చేస్తారని ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది.
Latest News