|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:50 PM
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకువచ్చిన 'ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్- 2026' ఇప్పుడు దేశంలో పెను చర్చకు దారితీసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఈ రూల్స్ తీసుకువచ్చామని చెబుతుండగా.. మరోవైపు జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం వీటిని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ నిబంధనల అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
అసలు యూజీసీ కొత్త రూల్స్ ఏంటి?
జనవరి 13వ తేదీన యూజీసీ ప్రకటించిన ఈ నిబంధనలు దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వర్తిస్తాయి. యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపడమే వీటి ప్రధాన ఉద్దేశాలు అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కుల వివక్షను అడ్డుకునేందుకు.. ఎస్సీ, ఎస్టీలతోపాటు.. ఈసారి జాబితాలో కొత్తగా ఓబీసీ విద్యార్థులను చేర్చారు. ఈ వర్గాలపై జరిగే వివక్షను అరికట్టడం కోసం వీటిని తెచ్చారు.
స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
ఈ యూజీసీ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని.. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యా సంస్థలు సమాజాన్ని విభజించే కేంద్రాలుగా మారకూడదని పేర్కొంది.
ఈ నిబంధనలు అమలు చేస్తే సమాజంలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలపై స్టే ఇచ్చిన కోర్టు.. ప్రస్తుతానికి 2026 రూల్స్‌ను నిలిపివేయాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా 2012 నాటి పాత యూజీసీ నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.
కొత్త నిబంధనలపై నిరసనలు ఎందుకు?
ఢిల్లీలోని యూజీసీ కార్యాలయం ముందు 'సవర్ణ సేన' ఆధ్వర్యంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ రూల్స్ కేవలం రిజర్వ్‌డ్ కేటగిరీల రక్షణకు మాత్రమే ఉన్నాయని.. కానీ జనరల్ కేటగిరీ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటే ఎవరికి చెప్పుకోవాలో స్పష్టత లేదని వారు ప్రధానంగా ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని.. దీనివల్ల క్యాంపస్‌లలో ప్రశాంతత దెబ్బతింటుందని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ వివరణ
మరోవైపు.. యూజీసీ కొత్త నిబంధనలపై జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే స్పందించారు. ఈ కొత్త నిబంధనలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూస్తామని.. ఎవరిపైనా వివక్ష ఉండదని ఆయన హామీ ఇచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తద్వి వంటి విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ మార్పులు తీసుకువచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
Latest News