|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:53 PM
కాంగ్రెస్ పార్టీలో తన స్థానంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో సీనియర్ నాయకుడు శశి థరూర్.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. గురువారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశం 90 నిమిషాల పాటు సాగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ థరూర్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీలో చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖర్గే, రాహుల్‌తో సమావేశం ముగిసిన తర్వాత థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము చాలా మంచి, నిర్మాణాత్మకమైన, సానుకూలమైన చర్చ జరిపాం.. అంతా బాగానే ఉంది, మేము ఒకే తాటిపై ముందుకు వెళ్తున్నాం...’ అని తెలిపారు.
శశిథరూర్ సొంత రాష్ట్రం కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీతో గంటన్నర పాటు థరూర్ భేటీ కావడం గమనార్హం. ఖర్గే, గాంధీలను కలిసి తన అభిప్రాయం తెలియజేయడానికి థరూర్ సమయం కోరినట్లు, ఎన్నికలకు ముందు పార్టీ ఆయన ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత థరూర్, కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. థరూర్ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చాలామంది ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతిస్పందన గురించి విదేశాలకు వివరించే ఓ ప్రతినిధి బృందానికి థరూర్‌ను కేంద్రం నియమించడం, అందుకు అంగీకరించడంతో సంబంధాలు మరింత దిగజారాయి.
గతేడాది నవంబర్‌లో ప్రధాని ప్రైవేట్ కార్యక్రమంలో థరూర్ పాల్గొని, ఆయనకు మద్దతుగా ఎక్స్‌లో పోస్ట్ పెట్డడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ‘ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఏ ఫ్యామిలీ బిజినెస్’ అనే శీర్షికతో థరూర్ రాసిన వ్యాసం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. వాస్తవానికి, 2022 మధ్యకాలం నుంచి పార్టీకి, శశిథరూర్‌కు మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత నాయకత్వంలో మార్పు కోరుతూ అప్పటి పార్టీ అధినేత సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నాయకుల బృందంలో ఈయన ఒకరు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్ పోటీ చేసి, గాంధీ విధేయుడు మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓడిపోయారు.
Latest News