|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 09:03 PM
సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి. ఎక్కడో, ఏ దేశంలోనో ఉండి.. మారుమూలన ఉన్న వారి దగ్గరి నుంచి క్షణాల్లో కోట్ల రూపాయలను కొట్టేసి.. దర్జాగా దొరకకుండా తిరుగుతున్న సైబర్ కేటుగాళ్ల పనిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవైపు.. సైబర్ దాడులు జరగకుండా చూడటమే కాకుండా.. సైబర్ మోసాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. రూ.11,500 కోట్ల భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకుని.. వారికి మరణ శిక్ష అమలు చేసినట్లు తెలిపింది.
గురువారం చైనా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్, హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ నేరాల నెట్‌వర్క్‌పై చైనా తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా ఇది నిలుస్తోంది.
చైనాలోని వెంజౌ సిటీ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి ఈ మింగ్ గ్యాంగ్ జరిపిన గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ ఫ్రాడ్ విలువ సుమారు 10 బిలియన్ యువాన్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 11,500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం ఒక సాయుధ ముఠాను నడుపుతూ.. స్కామ్ పార్కులను నిర్వహించేదని చైనా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరణశిక్షకు గురైన వారిలో సైబర్ నేరాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారులు ఉన్నారని సమాచారం. మింగ్ గుయోపింగ్ అనే ముఠా నాయకుడు మాత్రమే కాకుండా.. ఈ భారీ మోసంలో కీలక పాత్రధారి అయిన మింగ్ జెన్‌జెన్.. జో వెయిచాంగ్, వూ హాంగ్ మింగ్, లువావో జియాన్జాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుటుంబ పెద్ద మింగ్ జుచాంగ్ 2023లో చైనా పోలీసులకు చిక్కకుండా కస్టడీలోనే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
ఈ మింగ్ కుటుంబ సైబర్ నేరాలకు సంబంధించి.. చైనా ప్రభుత్వం మయన్మార్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఈ ముఠా సభ్యులను మయన్మార్ 2023 నవంబర్‌లో అదుపులోకి తీసుకుని చైనాకు అప్పగించింది. దీంతో ఈ కేసులో విచారణ నిర్వహించిన కోర్టు.. మొత్తం 11 మందికి మరణశిక్ష, మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెన్షన్ శిక్ష (తర్వాత జీవిత ఖైదుగా మారే అవకాశం ఉంది)ను 2025 సెప్టెంబర్‌లో విధించింది. ఈ కేసులో నిందితులు చేసుకున్న అప్పీళ్లను సుప్రీం పీపుల్స్ కోర్టు తిరస్కరించడంతో.. గురువారం ఉదయం మొత్తం 11 మందికి మరణశిక్షను అమలు చేశారు.
Latest News