|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:08 PM
విశాఖపట్నంలో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం ఎంపీ భరత్‌కి చెందిన గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు అనగా ఈనెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి క్రమబద్ధీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గీతం ఆక్రమణలో ఉన్న భూముల పరిశీలనకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం అక్కడే వారు మీడియాతో మాట్లాడుతూ ఈ భూముల బదలాయింపు అంశాన్ని ఎజెండా నుంచి తీసేస్తే తప్ప రేపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనివ్వమని, మా కార్పొరేటర్లు అడ్డుకుంటారని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ భూదోపిడీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని, ఎంపీ భరత్ భూదోపిడీపై పార్లమెంట్‌లో సైతం గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. రేపు మరోసారి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, మేథావులు, ఉద్యమ కారులతో కలిసి ఈ భూదోపిడీని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పోలీసులు దోపిడీదారులకు కాపాలాదారులుగా మారిపోయి, దోపిడీని అడ్డుకుంటున్న వైయస్ఆర్‌సీపీనాయకులను భూముల పరిశీలనకు వెళ్లకుండా ఆపడం సమంజసం కాదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Latest News