|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:12 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. మద్యం అక్రమ కేసులో సుదీర్ఘ కాలం పాటు జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నిన్న (గురువారం) బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తనపై కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు, అలాగే తన కుమారులు, కుటుంబ సభ్యులను కూడా కేసులతో వేధిస్తున్న తీరును వైయస్ జగన్‌కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి స్పందించిన వైయస్ జగన్, తప్పుడు కేసులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చట్టపరంగా ధైర్యంగా ఎదుర్కోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేసే పోరాటంలో ఇలాంటి ఆటంకాలు, వేధింపులు సహజమేనని అన్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Latest News