|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:22 PM
లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవమని వైయస్ఆర్‌సీపీ నేత, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా ఈ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ నాయకత్వం వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన మాట్లాడుతూ..లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతుడైన దేవదేవుడు అన్నీ గమనిస్తున్నాడని, దేవుడ్ని రాజకీయాలకు వాడుకుంటే ఆయనే తగిన బుద్ధి చెబుతాడని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు బెషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టంగా తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. బోలేబాబా డెయిరీకి అనుమతులు ఇచ్చింది కూటమి పాలక మండలే తప్ప, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన వివరించారు. తన కులదైవం వెంకటేశ్వరుడు అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన్నే రాజకీయానికి వాడుకోవడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందంటూ నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు.
Latest News