|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:34 PM
రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందరికీ ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉగాది రోజున ఐదు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు ఏపీ ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి లబ్ధిదారులు మార్చి నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకపోతే.. బిల్లులు నిలిచిపోయే అవకాశం ఉందని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే పలువురు లబ్ధిదారులు సొంత స్థలాలలోనూ ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే వివిధ కారణాలతో నిర్మాణాలను పూర్తి చేయకుండా అలాగే వదిలేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు 50 వేల రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75 వేల రూపాయల చొప్పున అదనంగా అందిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఉగాదిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలా చేయలేకపోతే.. ఉగాది తర్వాత లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించవని హెచ్చరిస్తున్నారు. దీంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోవచ్చని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోపే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు. మరోవైపు ఉగాది రోజున ఐదు లక్షల కొత్త ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Latest News