|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:03 PM
తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీబీఐ సిట్ తుది చార్జిషీట్‌లో ఎక్కడా పేర్కొనకపోయినా, కేసు బ్రీఫ్ నోట్ ని పట్టుకుని నారా లోకేష్ సహా కూటమి నాయకులు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ చార్జిషీట్‌లో పొందుపరిచిన ల్యాబ్ రిపోర్టులు కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి ఆధారాలే లేవని స్పష్టం చేసినా తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గీతం యూనివర్సిటీకి అప్పనంగా రూ.5 వేల కోట్ల విలువైన 55 ఎకరాలు కట్టబెట్టడంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసే కుట్రల్లో భాగంగానే సిట్ చార్జిషీట్ ను వక్రీకరిస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నెయ్యి శాంపిల్స్‌ను పరిశీలించి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిందని, అయినా కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారంటే దానికి సమాధానం కూడా వారే చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కనీసం ఇప్పుడైనా దుష్ప్రచారాలు మాని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు తమ తప్పు అంగీకరించి భక్తులకు క్షమాపణ చెప్పాలని, తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలని సూచించారు. కానీ ఫ్లెక్సీలు వేసి మరీ తిరుమల ప్రతిష్టను మరింత దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం ఇప్పటికైనా బీజేపీ నాయకులు కలగజేసుకుని చంద్రబాబును నియంత్రించి తిరుమల వేదికగా జరుగుతున్న అపచారాలు, పాపాలు ఆపాలని వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Latest News