|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:06 PM
తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను అవమానించిన చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారాలకు పరిహారంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలస్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నగర మేయర్, పశ్చిమ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పూజల అనంతరం వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మాట్లాడటం అత్యంత బాధాకరమని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న రాజకీయ కోపాన్ని వెంకటేశ్వర స్వామిపై చూపించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యతపై ఎప్పుడైనా భక్తులు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు.
Latest News