|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:14 PM
ఖాదీ, హస్తకళల పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ 2026లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనీషియేటివ్ పేరుతో సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఖాదీ పరిశ్రమ, హస్తకళలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఈ కొత్త స్కీమ్ లక్ష్యమని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ క్రమంలో కొత్త పథకం గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఖాదీ, హస్తకళలు,చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనీషియేటివ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా హస్త కళలు, చేనేత, ఖాదీ పరిశ్రమకు గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం కల్పించడం, బ్రాండింగ్ మద్దతు ఇచ్చి ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పిస్తామని తెలిపారు. అలాగే ఈ కొత్త కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, నాణ్యమైన ఉత్పత్తి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా గ్రామీణ పరిశ్రమలు, చేనేత కార్మికులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) ప్రోగ్రామ్, గ్రామీణ యువతకు మేలు కలగనుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
మరోవైపు.. భారత్ 7 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా కొనసాగేందుకు సంస్కరణలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రపచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తామని, దేశీయంగా ఉన్న అన్ని రంగాలకు బ్రాండింగ్ కల్పించి గ్లోబల్ మార్కెట్లలో వాటికి ఆదరణ దక్కేలా చూస్తామన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా దేశీయ యువత ఆకాంక్షలను నెరవేర్చేలా ఈ బడ్జెట్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలోని బలహీన వర్గాలు, పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Latest News