|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:46 PM
ఏపీలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఒకటి రెండు నెలల్లో ఏపీలోని పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన కోసం ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీని వెంటనే ప్రారంభించాలని.. మార్చి నెల 9వ తేదీన ఫోటోలతో సహా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఈవో కార్యాలయం నుంచి అసెంబ్లీల వారీగా ఓటర్ల జాబితాలు సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ వివరాలను సర్వర్లలో రికార్డు చేసింది.
మరోవైపు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు లాగిన్లు ఇచ్చారు. ఈ లాగిన్ల ద్వారా జాబితాలు సేకరించుకుని.. వాటిలో నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఓటర్ల జాబితా తయారు చేయనున్నట్లు తెలిపింది. 2026 జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల జాబితా అప్ డేట్ చేయాలని సూచించింది.
ఎన్నికలు అప్పుడేనా..
ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. 87 నగర పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 17తో ముగుస్తుంది. ఇక 36 పట్టణ స్థానిక సంస్థలలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రెండూ కలిపి 123 పట్టణ స్థానిక సంస్థలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వీటిలోని వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా తయారు కానుంది. అలాగే ఏపీలోని 13,098 పంచాయతీల పదవీ కాలం ఏప్రిల్ రెండో తేదీతో ముగియనుంది. 253 పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా మొత్తంగా 13,351 పంచాయతీలలోనూ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.