|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:50 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. అమరావతిలో ఏఐ లివింగ్ ల్యాబ్ ఫౌండేషన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనువర్తిత అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ ఏర్పాటు కానుంది. ప్రధాన కార్యాలయంలో అమరావతిలో ఏర్పాటు కానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏఐ లివింగ్ ల్యాబ్‌లను స్థాపించి, నిర్వహించనున్నారు.
"కంపెనీస్ యాక్ట్, 2013 ప్రకారం ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ పేరుతో సెక్షన్ 8 (లాభాపేక్షలేని) కంపెనీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది" అంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటింగ్ రిసోర్సెస్, ఏఐ టూల్స్, క్యూరేటెడ్ డేటా సెట్స్ సమకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ప్రతి కుటుంబంలోనూ ఒక ఏఐ శిక్షణ పొందిన వ్యక్తి ఉండాలనే ఆశయ సాధన కోసం ఈ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.
ఈ ఫౌండేషన్ ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలు, సర్టిఫికేషన్ పాత్‌వేస్, కరికులమ్ ఎనేబుల్‌మెంట్, ఫ్యాకల్టీ ట్రైనింగ్ వంటి అంశాలలోనూ సహకారం అందిస్తుంది. విద్యార్థులతో పాటుగా ఫ్యాకల్టీ, పరిశోధక విద్యార్థులు, స్టార్టప్స్, సూక్ష్మ. మధ్య తరహా పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలకు సహకారం అందిస్తుంది. అలాగే వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, తయారీ రంగం, ఫిన్ టెక్ రంగాలలో ఏఐ సేవలు అందిస్తుంది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ప్రభుత్వ గ్రాంట్లు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు ఉపయోగిస్తారు.
మరోవైపు అమరావతిని ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రోజున క్వాంటం వ్యాలీ భవనానికి శంకుస్థాపన కూడా నిర్వహించారు. ఈ భవనాన్ని ఆగస్టు నాటికి పూర్తి చేసి.. డిసెంబర్ నాటికి క్వాంటం వ్యాలీలో తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ పూర్తి అయితే దేశానికే గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెల్లడించారు. అమరావతి క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.