|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:01 PM
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి తృటిలో ట్రిపుల్ సెంచరీ కోల్పోయాడు. 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్స్‌లతో 299 పరుగులు చేసిన సుదీప్… ఒక్క పరుగు తేడాతో చరిత్రాత్మక ఘనతకు దూరమయ్యాడు.ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ట్రిపుల్ సెంచరీకి కేవలం ఒక్క రన్ దూరంలో ఉన్న సుదీప్… ఆంధ్ర పార్ట్‌టైమ్ బౌలర్ షేక్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.నిరాశతో పెవిలియన్ బాట పట్టిన సుదీప్ కుమార్‌ను ఆంధ్ర ఆటగాళ్లు ఓదార్చారు. ప్రేక్షకులతో పాటు ఇరు జట్ల సపోర్ట్ స్టాఫ్ సైతం అతడికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించారు.భారత క్రికెట్ చరిత్రలోనే ఒక్క పరుగుతో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న తొలి బ్యాటర్‌గా సుదీప్ కుమార్ నిలిచాడు. ఓవరాల్‌గా ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు 1991లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దిగ్గజం మార్టిన్ క్రో.. 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. అలాగే 2006లో గ్లామోర్గాన్ తరఫున ఆడిన మైకేల్ పావెల్ కూడా గ్లౌసెస్టర్‌షైర్‌పై 299 వద్ద వెనుదిరిగాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 295 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రికీ భుయ్ 174 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 83 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీఖర్ భరత్(47), షేక్ రషీద్(46) హాఫ్ సెంచరీలకు చేరువయ్యారు.బెంగాల్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 5/66తో ఐదు వికెట్లు పడగొట్టి మెరిశాడు. ఆకాష్ దీప్ 4/79తో సహకరించగా, మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది.అనంతరం బెంగాల్ జట్టు 199.1 ఓవర్లలో 629 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్‌తో పాటు హబిబ్ గాంధీ(95), సుమంత గుప్తా(95) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో మహమ్మద్ షమీ 33 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేసి స్కోర్‌ను భారీగా పెంచాడు.ఆంధ్ర బౌలర్లలో షేక్ రషీద్ 4/63తో అత్యధిక వికెట్లు తీశాడు. శశికాంత్, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, నితీష్ కుమార్ రెడ్డి, త్రిపురణ విజయ్ ఒక్కో వికెట్ సాధించారు.
Latest News