|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:10 PM
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఎదుట హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అంబటి రాంబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తాజాగా మరో కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో ఆ పార్టీ పలు నిరసనలు కూడా చేసింది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 2025 నవంబర్ 12వ తేదీ అంబటి రాంబాబు నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. అయితే ఆందోళన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం అంబటి రాంబాబును రాజమహేంద్రవరం నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు తరలించారు. గుంటూరులోని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. కేను విచారించిన న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు.
మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ మీద న్యాయస్థానంలో విచారణ జరగనుంది. అనంతరం రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబును తరలించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై ఇటీవల తెలుగు దేశం శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరులోని ఆయన నివాసం వద్ద ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటిపైనా, ఆయన వాహనాలపైనా దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపైనా గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.