|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:56 PM
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టించాయి. ఏకకాలంలో తొమ్మిది ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేవలం స్కూళ్లే కాకుండా.. ఫిబ్రవరి 13వ తేదీన భారత పార్లమెంటును కూడా పేల్చివేస్తామంటూ ఆ మెయిల్‌లో హెచ్చరికలు ఉండటం భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది.
రంగంలోకి బాంబు స్క్వాడ్.. తనిఖీలు ముమ్మరం
ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8.33 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తమకు మొదటి కాల్ అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, ఫైర్ టెండర్లతో సహా ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని లోరెటో కాన్వెంట్ స్కూల్ , శ్రీనివాసపురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్, రోహిణిలోని వెంకటేశ్వర స్కూల్, సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్, రోహిణిలోని బాల్ భారతి స్కూల్, రోహిణిలోని సీఎం స్కూల్, ఐఎన్ఏలోని డీటీఏ స్కూల్లలో తనిఖీలు చేపడుతున్నాయి.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పార్లమెంటుపై దాడికి డెడ్ లైన్!
అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఈ ఈ-మెయిల్‌లో అత్యంత అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే సందేశాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. "ఢిల్లీ త్వరలోనే ఖలిస్థాన్‌గా మారుతుంది.. పంజాబ్ అంటేనే ఖలిస్థాన్.. అఫ్జల్ గురు స్మారకార్థం ఈ చర్యలు చేపడుతున్నాం" అంటూ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 13వ తేదీన మధ్యాహ్నం 1.11 గంటలకు భారత పార్లమెంటు భవనంలో భారీ పేలుడు సంభవిస్తుందని దుండగులు డెడ్ లైన్ విధించారు. గతంలో కూడా పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భాలు ఉండటంతో భద్రతా సంస్థలు ఈ హెచ్చరికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు.
ఉత్తుత్తి బెదిరింపులేనా?
ప్రాథమిక తనిఖీల అనంతరం పాఠశాలల్లో ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని, ఇవి కల్పిత బెదిరింపులు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఒకేసారి ఇన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపడం వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం విచారణ జరుపుతోంది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వర్ ఎక్కడ ఉంది? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Latest News