'హిందూ గుడిలోకి పాస్టర్లు రావడం తప్పేమీ కాదు': కేరళ హైకోర్టు సంచలన తీర్పు
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:58 PM

దేశంలో చట్టాలు, నిబంధనలు అనేవి మతాల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉండకూడదని, అవి సమాజాన్ని ఏకం చేసే శక్తులుగా ఉండాలని కేరళ హైకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక ఆలయంలోకి క్రైస్తవ మతగురువులు ప్రవేశించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయస్థానం భారతీయ సంస్కృతిలోని అతిథి దేవోభవ స్ఫూర్తి మంత్రాన్ని గుర్తు చేసింది.


అసలేం జరిగిందంటే?


కేరళ పతనంతిట్ట జిల్లాలోని అదూర్ శ్రీ పార్థసారథి ఆలయంలో 2023 సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఆలయ పండితుడి ఆహ్వానం మేరకు డాక్టర్ జకారియా మార్ అప్రేమ్ అనే క్రైస్తవ మత గురువుతో పాటు మరో ఇద్దరు పాస్టర్లు హాజరు అయ్యారు. అయితే హిందూయేతరులు ఆలయంలోకి ప్రవేశించడం 'కేరళ హిందూ ప్రజా ఆరాధనా స్థలాల చట్టం-1965'కు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనిల్ నారాయణన్ నంబూద్రి అనే ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తులో ఇతర మతస్థులు ఎవరూ ఆలయంలోకి రాకుండా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ఆదేశించాలని కోరారు.


జస్టిస్ రాజా విజయ రాఘవన్ వి, జస్టిస్ కె.వి. జయ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 'మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ' అనే మంత్రాన్ని కోర్టు ఉటంకించింది. తల్లి, తండ్రి, గురువుతో పాటు అతిథి కూడా దైవ సమానమని, వారిని గౌరవించడం మన సంస్కృతి అని తెలిపింది. "ఈ కేసులో క్రైస్తవ మత గురువులు తమ హక్కుగా ఆలయంలోకి రాలేదు.. ఆలయ పండితుడి ఆహ్వానం మేరకు కేవలం 'అతిథులు'గా మాత్రమే వచ్చారు. దీనిని చట్టం ఉల్లంఘనగా పరిగణించలేం" అని కోర్టు స్పష్టం చేసింది.


ఈ తీర్పులో కోర్టు మరో ముఖ్యమైన చట్టపరమైన పాయింట్‌ను లేవనెత్తింది. 1965 నాటి అసలు చట్టం ప్రకారం.. హిందువుల్లోని అన్ని వర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించాలి. అయితే ఇందులో ఎక్కడా ఇతర మతస్థులను నిషేధించాలని లేదు. కానీ ఆ తర్వాత రూపొందించిన నిబంధనలలోని 'రూల్ 3(a)' హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తోంది. "అసలు చట్టానికి, నిబంధనలకు మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు చట్టమే చెల్లుబాటు అవుతుంది" అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నిబంధనను ప్రస్తుత కాలానికి అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా సవరించడంపై దేవస్వం బోర్డు, మత పండితులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

Latest News
Three children murdered in Bihar's Aurangabad, uncle suspected Fri, Mar 27, 2026, 03:51 PM
Raghav Chadha flags economic cost of traffic congestion, seeks National Urban Decongestion Mission Fri, Mar 27, 2026, 03:50 PM
US lawmakers press Trump on China pastor Fri, Mar 27, 2026, 03:28 PM
Dr Reddy's Labs to change drug name to 'Olymra' amid court scrutiny: Report Fri, Mar 27, 2026, 03:04 PM
US moves to overhaul military IT systems Fri, Mar 27, 2026, 03:02 PM