నోబెల్ గ్రహీత నర్గెస్ మహమ్మదీకి మరో ఏడేళ్ల జైలు శిక్ష,,,ఇరాన్ సంచలన నిర్ణయం
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:24 PM

మానవ హక్కుల కోసం, ముఖ్యంగా ఇరాన్‌లోని మహిళల స్వేచ్ఛ కోసం మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ (53) విషయంలో ఇరాన్ ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జైల్లో ఉండి నరకం చూస్తున్న ఆమెకు అక్కడి న్యాయస్థానం అదనంగా మరో ఏడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా ఆమెపై రెండేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది మోస్తాఫా నిలీ ధ్రువీకరించారు.


ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా నర్గెస్ మొహమ్మదీ ఫిబ్రవరి 2 నుంచి జైలులోనే నిరాహార దీక్షను చేపట్టారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి, ఆమె గొంతును మరింత బలంగా నొక్కే ప్రయత్నం చేయడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తోంది. తాజా తీర్పు ప్రకారం.. ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు గాను ఆరేళ్లు, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేసినందుకు మరో ఏడాదిన్నర శిక్షను ఖరారు చేశారు. అయితే, ఈ శిక్షావిధిపై ఇరాన్ అధికారిక యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.


కొరడా దెబ్బలకు లొంగని ధైర్యం..


మహిళా హక్కుల కోసం నర్గెస్ మొహమ్మదీ చేసిన అనేక ప్రయత్నాలకు ఇరాన్ ప్రభుత్వం పలుమార్లు అడ్డుతగిలింది. తన జీవిత కాలంలో ఆమె అనేక సార్లు అరెస్టు అయ్యారు. మరెన్నో సార్లు జైలు శిక్షను అనుభవించారు. చివరికి ప్రభుత్వ ఆదేశాలతో అమానుషమైన కొరడా దెబ్బలను కూడా తిన్నారు. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నుంచి వెనకడుగు వేయలేదు. ఆమె చేస్తున్న ఈ నిరంతర పోరాటాన్ని గుర్తించిన నోబెల్ కమిటీ.. 2023లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'నోబెల్ శాంతి బహుమతి'ని ప్రకటించింది. జైలులో ఉంటూనే నోబెల్ గ్రహీతగా నిలిచిన అతికొద్ది మందిలో నర్గెస్ ఒకరు.


నర్గెస్ మొహమ్మదీకి విధించిన ఈ అదనపు శిక్ష పట్ల ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ఒక మేధావిని.. వయసు పైబడిన మహిళను ఇలా నిరంతరం వేధించడం అమానవీయమని మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. 30 ఏళ్లకు పైగా ఆమె సాగిస్తున్న ఈ ఉద్యమం.. ఇరాన్ యువతలో స్ఫూర్తిని నింపుతోందని, అందుకే ప్రభుత్వం ఆమెను విడుదల చేయడానికి భయపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Latest News
This freedom fighter and centenarian bats against turncoat politics, preferring principles over power Fri, Mar 27, 2026, 05:04 PM
88 pc firms say cloud spending not enough to support AI push: Report Fri, Mar 27, 2026, 04:46 PM
Govt assures steady fertiliser supplies through import diversification, capacity expansion Fri, Mar 27, 2026, 04:45 PM
Archery Asia Cup: Compound archers shine as India finish with 10 medals Fri, Mar 27, 2026, 04:43 PM
ONDC's DigiHaat brings artisans, farmers onto digital commerce grid Fri, Mar 27, 2026, 04:40 PM