|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:25 PM
కాకినాడ జిల్లా తునిలోని జీఎన్‌టీ రోడ్డు రామా థియేటర్ దగ్గర బ్యాంక్ ఏటీఎం ఉంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఏటీఎంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. ఓ రాయి తీసుకుని ఏటీఎం మెషిన్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఇనుప చువ్వ సాయంతో డోర్ కూడా ఓపెన్ చేశాడు.. కానీ డ్యామిట్ కథ అక్కడే అడ్డం తిరిగింది. అయితే ఏటీఎం మెషిన్‌లో డబ్బులు ఉండే అసలైన డోర్‌ను తీసేందుకు ప్రయత్నించినా అది ఓపెన్ కాలేదు. అయితే 20 నిమిషాల పాటూ ప్రయత్నం కొనసాగింది.
ఏటీఎంలో చోరీ యత్నం మొత్తం అక్కడే సీసీ కెమెరాలలో రికార్డయ్యింది. ఇంతలో దొంగతనం వ్యవహారాన్ని బ్యాంకు సెంట్రల్ టీమ్ గుర్తించింది. వెంటనే ఆ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌కు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని గాలించి పోలీసులు పట్టుకున్నారు. అతడి గురించి ఆరా తీస్తే కీలక విషయాలు తెలిశాయి. ఏటీఎం ఎందుకు పగులగొట్టావని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పాడట.
తుని పోలీసులు ఏటీఎం పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి జార్ఖండ్‌కు చెందిన రంజిత్‌కుమార్ జాదవ్‌గా గుర్తించారు. రంజిత్ అక్కడ ప్రభుత్వ స్కూల్‌లో కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఆ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని భావించాడు.. కానీ అది పర్మినెంట్ కాకపోవడంతో ఉద్యోగానికి రీజానమా చేశాడు. అయితే గత రెండేళ్లుగా జాదవ్ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదట. అతడు ఇటీవల జార్ఖండ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లాడు. అయితే రంజిత్ మళ్లీ జార్ఖండ్‌కు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. అయితే టికెట్ తీసుకోకపోవడంతో రైల్వే టీటీఈ గుర్తించి.. అతడ్ని కాకినాడ జిల్లా తునిలో దించేశారు. ఈ క్రమంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో.. వెంటనే తునిలో తిరుగుతూ డబ్బుల కోసం ఏటీఎంలో చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చారు.
Latest News