|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:37 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో జరిగిన 18 దారుణ ఘటనల్లో పలువురు విద్యార్థులు మరణించగా, వేల మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రుల పాలయ్యారని ఇవన్నీ విద్యార్థుల పట్ల చంద్రబాబు క్రూర మనస్తత్వానికి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏదీ అమలు చేయకుండా పచ్చి అబద్ధాలు, మోసాలతో 20 నెలలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. అయినా సెక్రటరీల సమావేశంలో మాత్రం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేశానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పేదే నిజమైతే కూటమి ప్రభుత్వం వచ్చాక రెండింతలైన విద్యుత్ చార్జీలు, పెరిగిన బస్ చార్జీలు, ఆకాశాన్నంటిన నిత్యవసర వస్తువుల ధరలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఐదేళ్లుగా పోరాడి నాటి సీఎం వైయస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడితే చంద్రబాబు సీఎం అయ్యాక ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తూ ఉద్యోగులు, కార్మికుల జీవితాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దమ్ముంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ప్రధానితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న దారుణాలకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు.
Latest News