|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:41 AM
అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రిమెంట్‌తో బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులకు జీరో టారిఫ్ లభించింది. అయితే, అమెరికాకు చెందిన కాటన్, సింథటిక్ మెటీరియల్స్ వాడితేనే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా కార్లు, మోటార్ సైకిళ్లు, మెడికల్ డివైసులు, ఐటీ పరికరాలు, ఎనర్జీ ఉత్పత్తులు, సోయా ఆధారిత వస్తువులకు బంగ్లాదేశ్‌లో ప్రాధాన్యత లభిస్తుంది. బంగ్లాదేశ్ రానున్న 15 ఏళ్లలో 3.5 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు, 15 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంతో పాటు, బోయింగ్ నుంచి 25 విమానాలు కొనుగోలు చేయాలి.గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. మొదట బంగ్లాదేశ్ ఎగుమతులపై అమెరికా 37 శాతం వరకు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. సుదీర్ఘ చర్చల అనంతరం దీనిని మొదట 20 శాతానికి, ఇప్పుడు తాజాగా 19 శాతానికి తగ్గించారు. ఈ సుంకాల తగ్గింపునకు బదులుగా, బంగ్లాదేశ్ కూడా కొన్ని అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ఒప్పందం అధికారికంగా అమల్లోకి రావాలంటే ఇరు దేశాలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది.
Latest News