|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:43 AM
పెద్ద జీయర్ స్వామి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపులకు బలైపోయాడని.. టీటీడీ చైర్మన్, ఈవో, మరో అధికారి కలిసి మూడు గంటల పాటు ఆయన్ను ఒత్తిడికి గురి చేసి లేఖ రాయించారని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆలయ ఈవోలు ఆరోపణలు చేసినప్పుడు స్పందించని పెద్ద జీయర్ స్వామి.. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన తర్వాత లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. తెలుగు రాయడమే రాని పెద్ద జీయర్ స్వామితో తెలుగులో లేఖ రాయించి సంతకం తీసుకోవడంపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ని హిందూ ద్వేషింగా చిత్రీకరించి రాజకీయంగా ఆయన్ను లేకుండా చేయాలన్న చంద్రబాబు క్షద్ర రాజకీయ కుట్రలో సమిధలు కావొద్దని ఆయనకు భూమన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద జీయర్ స్వామికి విలువ లేకుండా పోయిందని, పది రోజులపాటు నిర్వహించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని రెండు రోజులకు పరిమితం చేసిన సందర్భంగా ఈ విషయం బయటపడిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపులతో ధర్నాలు చేస్తున్న మఠాధిపతులు, స్వామీజీలు.. పరీక్షలకు పంపిన నెయ్యి శాంపిల్ చంద్రబాబు సీఎం అయ్యాక తీసుకున్నదేనని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ని హిందూ ద్వేషిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు రాజకీయ క్రీడలో భాగస్వాములై వంతపాడుతున్న వారంతా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
Latest News