|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 08:23 PM
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ పూరీ స్పందించారు. తనకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే, తాను ఎప్‌స్టీన్‌ను అంతర్జాతీయ శాంతి సంస్థ బృందంలో భాగంగా కలిశానని స్పష్టం చేశారు ‘‘ఐపీఐ చీఫ్‌కు ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉంది.. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయనను కలిశాను.. మూడు మిలియన్ల ఫైల్స్‌లో నా పేరు మూడు నాలుగు సార్లు మాత్రమే ఉంది.. కేవలం ఒక్కసారి మెయిల్ సంభాషణ చేసుకున్నాం... ఎప్‌స్టీన్‌పై ఆరోపణలకు.. మా మధ్య జరిగిన సంభాషణకు ఎలాంటి సంబంధం లేదు.. మేకిన్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం’’ అని పేర్కొన్నారు..
ఇదంతా తప్పుడు ప్రచారమని రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్‌లో కొన్ని అంశాలు మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. దేశ రాజకీయ వ్యవస్థలో రెండు రకాల నాయకులు ఉంటారు.. బాధ్యతాయుతంగా వ్యవహరించి, సామాజిక సేవకే జీవితాన్ని అంకితం చేసేవారు కొందరైతే.. అప్పుడప్పుడు దేశానికి వచ్చేవారు కొందరు.. వారికి చట్టసభలో సరైన సమాధానం ఇచ్చినప్పుడు వినకుండా వాకౌట్ చేస్తుంటారు’’ అని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రియల్స్ సంస్థ అధినేత అనిల్ అంబానీ పేరు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఎప్‌స్టీన్ కార్యకలాపాలపై నాకు ఎటువంటి ఆసక్తి లేదని, తాను అలాంటి వ్యక్తిని కాదని హర్‌దీప్ పూరీ చెప్పారు. అంతేకాదు, తను రెండు ముఖాలు కలిగిన వ్యక్తనని ఎప్‌స్టీన్ అన్నట్టు వివరించారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 నాటి ఇజ్రాయెల్ పర్యటన గురించి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందంటూ జరిగిన ప్రచారాన్ని జనవరి 31 భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఖండించారు.
గత నెలలో అమెరికా న్యాయశాఖ మూడు మిలియన్ల ఎప్‌స్టీన్ ఫైల్స్ 2,000 వీడియోలు, 1,80,000 ఫొటోలను విడుదల చేసింది. రాజకీయ, పౌర సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ కింద బయటపెట్టింది. తన పలుకుడిని పెంచుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సంబంధాలు నడిపిన ఎప్‌స్టీన్.. వారికి మైనర్ బాలికలను ఎరగా వేశాడనేది ప్రధాన ఆరోపణ. లైంగిక నేరాల ఆరోపణల కేసులో 2019లో అరెస్టైన అతడు.. న్యూయార్క్ జైల్లో ఉండగానే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా చాలాసార్లు వచ్చింది.
Latest News