|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 08:24 PM
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత అమానుషానికి పాల్పడింది. డబ్బుకు ఆశపడి తన కన్నబిడ్డను 54 ఏళ్ల వ్యక్తికి ఆమ్మేసింది. తల్లి అనే పదానికి కళంకం తీసుకొచ్చేలా మహిళ ప్రవర్తించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరు బీడీ కాలనీకి చెందిన రామరాజు, శోభ దంపతులకు ముగ్గురు అమ్మాయి. అయితే, గత కొన్నాళ్ల నుంచి భర్త రామరాజు, భార్య శోభల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో రెండు నెలల కిందట భర్తతో గొడవపడిన శోభ తన పిల్లలను తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో తన పెద్ద కుమార్తె 14 ఏళ్ల బాలికను అమ్మేయాలని శోభ ప్లాన్ చేసింది. ఇందుకు రెడ్డప్ప అనే మధ్యవర్తి ద్వారా ప్రయత్నాలు చేసింది. అతడు కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే 54 ఏళ్ల వ్యక్తితో బేరం కుదిర్చాడు. శోభకు రూ.2 లక్షలు ఇవ్వడానికి అతడు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం అడ్వాన్స్‌గా రాజశేఖర్ రెడ్డి ఆమెకు రూ.50 వేలు ఇచ్చాడు. దీంతో 10 రోజుల కిందట బెంగళూరులో బాలికను వివాహం చేసుకుని అతడు ఇంటికి తీసుకెళ్లాడు. ఈ పెళ్లిని ఆమె దగ్గరుండి జరిపించింది. అయితే, బాలికను రాయల్పాడుకు తీసుకెళ్లిన తర్వాత నుంచి రాజశేఖర్ ఇబ్బందులకు గురిచేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన చిన్నాన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.
చివరకు బాబాయి చిన్నాన్న సాయంతో అక్కడ నుంచి బయటపడి పుంగనూరు చేరుకుంది. అనంతరం బాబాయి, కూతురు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఈ ఘటన కర్ణాటకలో జరిగిందని చెప్పి స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే, ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఇక, ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి జిల్లా అధికార యంత్రాంగం.. విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఐసీడీఎస్ అధికారులు ఆదేశించింది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఆ చిన్నారి చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, తల్లి శోభ మాట్లాడుతూ.. భర్తతో విబేధాల వల్ల ఇంటి నుంచి తాను బయటకు వచ్చేశానని చెప్పింది. ఏ తల్లి చేయకూడని విధంగా ప్రవర్తించానని, రెడ్డప్ప నమ్మించి తనను మోసం చేశాడని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటారా? కర్ణాటకకు పోలీసులు బదిలీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Latest News