|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 08:29 PM
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీవిమర్శలు గుప్పించారు. భరతమాతను అమెరికాకు అమ్మేశారని, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రాహుల్ ధ్వజమెత్తారు. ప్రపంచ క్రమంలో అస్థిరత నెలకున్న వేళ భారత వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందని, వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు అమెరికాకు అమ్మేసిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు భారతదేశాన్ని అమ్మేశారు. భరతమాతను అమ్మేయడం మీకు సిగ్గు అనిపించడం లేదా? మన తల్లి భారతమాతను అమ్మేశారు... ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాధారణ పరిస్థితుల్లో దేశాన్ని ప్రధాన మంత్రి అమ్మరని నాకు తెలుసు. ఆయన భారత్‌ను ఎందుకు అమ్మేశారో తెలుసా? వాళ్లు ఆయన మెడ పట్టుకున్నారు. ప్రధాని కళ్లలో భయం కనబడుతోంది.. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి.. మొదటిది ఎప్‌స్టీన్ ఫైల్స్,’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
‘‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేరుందని, మరి ఆయనను ఎందుకు జైల్లో పెట్టలేదు.. హర్దీప్ పూరిని కూడా నేను అడగాలనుకుంటున్నాను.. అతడ్ని ఎప్‌స్టీన్‌కు ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ, ఇండియా కూటమి. వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపి ఉంటే తమ వైఖరి ఏలా ఉండేదో రాహుల్ వివరించారు. విధానాలను నిర్ణయించడంలో చంచల స్వభావానికి పేరుగాంచిన ట్రంప్‌తో వ్యవహరించడంలో భారత్ ఆదర్శంగా వ్యవహరించాల్సింది ఏంటి అనే దానిపై ఆయన మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇస్తూ.... ‘‘ట్రంప్‌తో ఇండియా కూటమి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపి ఉంటే.. మేము ఏమి చేసేవాళ్లమో మీకు చెబుతాను. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు (ట్రంప్) మీ డాలర్‌ను రక్షించుకోవాలనుకుంటున్నారు.. మేము మీ స్నేహితులుగా అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాము. మీ డాలర్‌ను రక్షించుకోవడానికి మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాం.. కానీ మీరు మీ డాలర్‌ను రక్షించుకోవాలనుకుంటే దానిని రక్షించగల అతిపెద్ద ఆస్తి భారతీయుల వద్ద ఉందని దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఈ డేటాను యాక్సెస్ చేయాలనుకుంటే, దయచేసి మీరు మాతో సమానంగా మాట్లాడాలని అర్థం చేసుకోండి. మేము మీ సేవకులమని అనుకోవద్దు’’ అని చెప్పేవాళ్లమని రాహుల్ వ్యాఖ్యానించారు.
అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. దీనిని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదని, పరస్పరం అనే ఆలోచననే తారుమారు చేసే ముందస్తుగా నిర్ణయించిన కొనుగోలు లాంటిదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయనపై సభా హక్కుల సంఘం కింద నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్న కేంద్రం.. తక్షణమే స్పీకర్ ఛాంబర్ ముందుకు రావాలని సూచించింది.