|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 08:37 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత వారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించిన ఓ కార్యక్రమానికి హాజరు కావడం.. జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా ముంబైలో జరిగిన ఈ సమావేశం ముగిసి రోజులు గడుస్తున్నా.. దీని చుట్టూ అల్లుకున్న వివాదం మాత్రం తగ్గడం లేదు. సల్మాన్ రాకను బీజేపీ సమర్థిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన 'స్క్రీన్ ప్లే' అని ఆరోపిస్తున్నాయి.
ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఉద్ధవ్ ఠాక్రే కంటే సల్మాన్ ఖానే పెద్ద హిందువు. కనీసం ఆయనకు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యే ధైర్యం ఉంది" అంటూ శివసేన (యుబిటి) నేతపై విమర్శలు గుప్పించారు. హిందూత్వ ఎజెండాను ఉద్ధవ్ పక్కన పెట్టేశారని ఎద్దేవా చేస్తూనే.. సల్మాన్ రాకను ఆయన సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు.
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. సల్మాన్ ఖాన్ తన ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్లలేదని ఆరోపించారు. "సల్మాన్ ఒక నటుడు. అతను గౌరవంగా బతకాలి. అధికారంలో ఉన్నవారు పిలిస్తే కాదు అనడానికి అతనికి ధైర్యం సరిపోదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన పనే" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ముస్లింలను ఆహ్వానిస్తున్నామని చూపించుకోవడానికి, జనాన్ని పోగు చేయడానికి సల్మాన్‌ను వాడుకున్నారని విమర్శించారు. అధికారం పోతే ఇలాంటి స్టార్ హీరోలు మీ స్టేజీల వైపు కన్నెత్తి కూడా చూడరని ఎద్దేవా చేశారు.ఇదీ చూడండి: "మీ పూర్వీకుల సంగతేంటి?": మోహన్ భాగవత్‌తో విందుపై ట్రోల్ చేసిన కాంగ్రెస్‌కు అద్నాన్ సమీ చురకలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాత్రం సల్మాన్ ఖాన్‌కు పూర్తి మద్దతు తెలిపారు. "సల్మాన్ ఖాన్ ఒక భారతీయ పౌరుడు. ఆయన తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మన సంస్కృతిని గౌరవిస్తారు. ముంబైలో జరిగే ఒక కార్యక్రమానికి ముంబై వాసిగా హాజరు కావడాన్ని రాజకీయీకరణ చేయడం సరికాదు" అని స్పష్టం చేశారు. బెంగాలీ నటి రూపాలీ గంగూలీ కూడా స్పందిస్తూ.. ఎవరినీ బలవంతం చేయలేదని, అందరూ సంతోషంగానే హాజరు అయ్యారని విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ 'స్వదేశీ' ఆర్థిక నమూనా గురించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండవచ్చని.. కానీ అది ఒత్తిడితో కూడినది కాకుండా స్వచ్ఛందంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ వార్స్ లేదా పన్నుల ఒత్తిడి ద్వారా వ్యాపారాలు జరగకూడదని ఆయన హితవు పలికారు.