|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 09:48 PM
కెనడా స్కూల్‌లో కాల్పుల కలకలం రేగింది.. బ్రిటిష్ కొలంబియాలోని ఓ పాఠశాలలో ఆగంతకురాలు దారుణానికి తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ 10 మంది మృతిచెందగా.. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో అనుమానితురాలు కూడా ఉన్నాడని, కాల్పుల తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని సెకెండరీ స్కూల్‌లో కాల్పులు జరిగినట్టు సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలోనే ఆరుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
వీరు కూడా పాఠశాల్లో జరిగిన కాల్పుల ఘటనలోనే గాయపడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. గాయపడినవాళ్లు ఇంకా ఎక్కడైనా ఉన్నారేమోననే అనుమానంతో సమీపంలోని ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. కొద్ది గంటల అనంతరం ఈ ఆదేశాలను ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండో అనుమానితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టంబ్లర్ రిడ్జ్ పట్టణంతో పాటు చుట్టుపక్కల అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. వారం రోజుల పాటు పాఠశాలను మూసివేశారు.
పాఠశాల నుంచి విద్యార్థులు, సిబ్బంది సహా 100 మందిని సురక్షితంగా తరలించినట్టు ఆర్సీఎంపీ నార్త్ డిస్ట్రిక్ట్ చీఫ్ సూపరింటిండెంట్ కెన్ ఫ్లాయిడ్ తెలిపారు. ఈ కాల్పులకు గల కారణం ఏంటో పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఘటనపై స్పందించిన కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఆపరేషన్ చేపట్టారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వీలైనంత మేర సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం టంబ్లర్ రిడ్జ్ సెకెండరీ స్కూల్‌లో ఏడు నుంచి 12వ తరగతి వరకూ మొత్తం 175 మంది విద్యార్తులు ఉన్నారు.
Latest News