|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:16 PM
రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండమంటూ రైల్వేస్టేషన్లలో నిత్యం ప్రకటనలు వింటూనే ఉంటాం. అలాగే బోర్డులపై ప్రకటనలు కూడా కనిపిస్తుంటాయి. కానీ పట్టించుకుంటేగా.. అలా పట్టించుకోకుండా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడి ప్రాణం రిస్కులో పడితే.. కానిస్టేబుల్ దేవుడిలా వచ్చి కాపాడిన ఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ మీద ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన రైల్వే కానిస్టేబుల్ అంటూ ఈ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే పంచుకుంది.
చర్లపల్లి - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతోంది. ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది. అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో బోగీలు నిండిపోయాయి. దీంతో ట్రైన్ డోర్ల వద్దే నిల్చుని ప్రయాణిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చర్లపల్లి - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కదులుతున్న రైలులోకి ఆదరాబాదరగా ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఉన్న గ్యాప్‌లో పడబోయాడు.
అయితే ఇదే సమయంలో ఎం. నరసింహారావు అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుడు రైలు నుంచి జారిపడుతున్న సంగతిని గుర్తించిన కానిస్టేబుల్ నరసింహారావు వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యన ఉన్న గ్యాప్‌లో పడకుండా అతన్ని ప్లాట్‌ఫామ్ మీదకు లాగారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌తో పాటుగా ఆ ప్రయాణికుడు, పక్కనే నిల్చున్న మరో ప్యాసింజర్ కూడా కింద పడిపోయారు. అయితే పట్టాలపై పడకుండా జాగ్రత్త వహించటంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే ఆ ప్రయాణికుడు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యన ఇరుక్కుపోయేవారు.
మరోవైపు ఈ ఘటన అనంతరం రైళ్లోని ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగటంతో.. రైలును ఆపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. దీంతో ప్రయాణికుణ్ని మళ్లీ అదే ట్రైనులోకి ఎక్కించారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ ప్రయాణికుడు.. తన కుటుంబంతో కలిసి తన జర్నీ కొనసాగించారు. ఈ వీడియోను పంచుకున్న దక్షిణ మధ్య రైల్వే.. కానిస్టేబుల్‌ను ప్రశంసించింది. అలాగే రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
Latest News