|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:30 PM
ప్రధాన మంత్రి కార్యాలయం కొత్త భవనం ‘సేవా తీర్థ్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా తీర్థ్ నుంచి ప్రధాని కీలక నిర్ణయాలు ప్రకటించారు. అత్యవసర ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారికత, వ్యవసాయ మౌలిక వసతులు, ఇన్నోవేషన్ ఎకానమీకి సంబంధించిన ఫైళ్లపై ప్రధాని సంతకం చేశారు.
స్టార్టప్ ఇండియా 2.0 పథకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన మోదీ.. ఇందు కోసం రూ.10 వేల కోట్లతో భారీ కార్పస్ ఫండ్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, పీఎం రాహత్ పథకం, లక్‌పతి దీదీలను 6 కోట్లకు పెంచనున్నట్టు పేర్కొన్నారు, ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్యం అందజేయనున్నట్టు చెప్పారు. వ్యవసాయ మౌలిక సుదుపాయాల నిధి రెట్టింపు చేస్తున్నట్టు మోదీ వెల్లడించారు.
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమే సేవా తీర్థ్ అని అన్నారు. ఇది దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజరిక పోకడలకు తావులేదని, స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా బానిసత్వపు వాసనలు పోలేదని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా రైసినా హిల్‌లో నిర్మించిన పీఎం ఆఫీసుకు ‘సేవా తీర్థ’ అనే పేరు పెట్టారు. ఇందులో ప్రధాని కార్యాలయం సేవా తీర్థ్, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి ఆఫీసు ఏర్పాటుచేస్తున్నారు.
ప్రధాని కార్యాలయంతో పాటు 8 మంత్రిత్వ శాఖల భవనాల్లో 3 ఇప్పటికే అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు మొదలయ్యాయి. గతంలో పీఎంవోకు ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ అనే పేరును సూచించారు. కానీ తర్వాత సేవకు పవిత్ర స్థలం అని అర్థం వచ్చేలా సేవా తీర్థ్ అని నామకరణం చేయాలని నిర్ణయించారు. ఇక, కొత్త ఆఫీసులో ప్రముఖులను కలిసేందుకు అత్యాధునిక వసతులతో గదులు నిర్మించారు. సాంకేతికంగా అన్ని సౌకర్యాలే కాదు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వీటిని నిర్మించారు. ఈ కార్యాలయానికి సమీపంలోనే ప్రధాని నివాసం కూడా నిర్మాణం చేస్తున్నారు. అది పూర్తయ్యాక 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని నివాసం నుంచి ఆయన అక్కడికి మారతారు.