|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 09:00 PM
రోజ్ డేను పురస్కరించుకుని ఓ భార్య.. తన భర్తకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే ఓ చోట కూర్చోబెట్టి గులాబీలు పూలు ఇచ్చింది. ఆపై ఓ మద్యం బాటిల్‌ను బహుమతిగా అందజేసింది. దీంతో భర్త ఫుల్ సంబుర పడిపోగా.. ఆమె కూడా అతడి ఆనందాన్ని చూసి మురిసిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉండగా.. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గొడవ మొదలైంది. ముఖ్యంగా దీని వల్ల వీరిద్దరూ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. రోజ్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకే వీరికి చిక్కుల్లో ఎలా పడ్డారు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మద్యం సీసాతో రోజ్ డే విషెస్
బీహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన కాంచన్ దేవి అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. రోజ్ డే సందర్భంగా ఆమె తన భర్తకు గులాబీ పూలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఆమె అసలు తప్పు చేసింది. బీహార్‌లో పూర్తిస్థాయి మద్యం నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. ఆమె తన భర్తకు ఓ మద్యం బాటిల్‌ను బహుమతిగా అందజేసి.. అక్కడే దాన్ని ఓపెన్ చేసి మరీ ఒక గ్లాసు వైన్ పోసి ఇచ్చింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఈ వీడియో పోలీసుల కంట కూడా పడగా.. విచారణ ప్రారంభించారు.
మద్యం వీడియో వైరల్ అవుతుండగానే.. కాంచన్ దేవికి సంబంధించిన మరో ఫోటో వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె ఒక బ్యూటీ పార్లర్‌లో ఆమె తుపాకీ పట్టుకుని స్టైల్‌గా ఫోజులిచ్చారు. ఈ రెండు అంశాలను సీరియస్‌గా తీసుకున్న ముంగేర్ ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్.. వెంటనే విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే ఆమె పట్టుకున్న తుపాకీ విశాల్ కుమార్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. దానికి లైసెన్స్ ఉన్నప్పటికీ.. సంబంధం లేని వ్యక్తులకు ఆయుధాన్ని ఇవ్వడం, దానితో సోషల్ మీడియా కోసం ఫోటోలు దిగడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కాంచన్ దేవితో పాటు ఆయుధ యజమాని విశాల్‌పై కూడా కేసులు నమోదు చేశారు.
మద్యం నిషేధం ఉన్న రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సహించడం, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం తీవ్రమైన నేరాలని ఎస్పీ మసూద్ హెచ్చరించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
Latest News