|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 10:52 PM
సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. మొత్తం 299 స్థానాలకుగానూ ఆ పార్టీ 212 చోట్ల విజయం సాధించి దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టబోతోంది. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కాబోతున్నారు. అయితే, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనాను అప్పగించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పింది. విచారణకు ఆమెను భారత్ అప్పగించాలని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం ఆమె శిక్ష ఎదుర్కోవాల్సిందే అని పేర్కొంది.
బీఎన్సీ సీనియర్ నాయకుడు సలాహుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘షేక్ హసీనాను అప్పగింంచాలని విదేశాంగ మంత్రి ఇప్పటికే కోరారు.. దీనికి మేము మద్దతు ఇచ్చాం’అని అన్నారు. చట్టం ప్రకారం ఆమెను అప్పగించాలని మేము పదే పదే చెబుతున్నాం.. ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య దీనిపై సమావేశం జరిగింది.. విచారణను ఎదుర్కొడానికి షేక్ హసీనాను దయచేసి బంగ్లాదేశ్‌కు పంపాలని భారత్ ప్రభుత్వాన్ని కోరాం’ అని అన్నారు. ఈ క్రమంలో భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సాధారణ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటుంది, కానీ, సమాన నిబంధనలతో మాత్రమే ఉంటుందని అహ్మద్ నొక్కిచెప్పారు. ‘భారతదేశంతో సహా అన్ని దేశాలతో పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా స్నేహపూర్వక సంబంధం మనకు అవసరం’ అని ఆయన అన్నారు.
ఆగస్టు 2024 నాటి విద్యార్థుల ఉద్యమంతో పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆమె న్యూఢిల్లీలోని ఓ రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెపై యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు కేసులు పెట్టగా.. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఓ కేసులో మరణ శిక్ష విధించింది. దీంతో ఆమెను అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తుంది. తాజా ఎన్నికల ఫలితాల ఈ నేపథ్యంలో హసీనా విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.