రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలు.. రెండు రోజుల ముందే, జనసేన పార్టీ నేత బొలిశెట్టి ఆసక్తికర ట్వీట్
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:28 PM

రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన అలజడి సృష్టిస్తోంది. కల్తీ పాలు తాగి ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటను సీరియస్‌గా తీసుకుంది. వైద్య బృందాలను పంపించి బాధితులందరికీ తక్షణం వైద్య సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజమండ్రి పరిధిలోని లాలాచెరువు, దివాన్ చెరువు ప్రాంతాల్లోని పలు కాలనీలకు ఈ కల్తీ పాలు సరఫరా అయినట్లు తెలుస్తోంది. కో­రుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌ అనే వ్యక్తి ఈ కుటుంబాలకు రోజూ పాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 150 కుటుంబాలకు ఇతడు పాలు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


ఈ ఘటనపై జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తూ.. 'రాజమండ్రి మరణాలకు అసలు కారణం పాలా లేక నీళ్ళా..? నిజానిజాలు నిష్పక్షపాతంగా తేలాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో కల్తీ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. కానీ, కనీసం పరీక్షా నివేదికలు కూడా రాకముందే అవి కేవలం పాల వల్ల జరిగిన మరణాలని నిర్ధారించి ముగింపు పలకడం సరికాదు. రాజమండ్రి మాత్రమే కాదు, రాష్ట్రమంతటా సంభవిస్తున్న అనేక మరణాలకు అసలు కారణం జల, వాయు, భూగర్భ కాలుష్యం! దీనిపై పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించాలి ప్రతి చోటా ప్రజలను భాగస్వామ్యం చేయాలి. కేవలం రివ్యూలతోనో లేదా అసెంబ్లీలో మాట్లాడితేనో సమస్య సద్దుమణగదు .. కాలుష్య నియంత్రణ మండలి క్షేత్ర స్థాయిలో తన బాధ్యతను నిర్వర్తించేలా చేయాలి. వారి పనితీరు మరియు తీసుకునే కఠిన చర్యలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడాలి' అన్నారు.


'4 ఏళ్ల క్రితమే నేను, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారితో కలిసి చావుకు భయపడకుండా ఏపీ పేపర్ మిల్స్, రాజమండ్రి మున్సిపాలిటీ వ్యర్థాలు, ఆంధ్రా షుగర్స్ విడుదల చేస్తున్న కాలుష్యం గోదావరిని ఎలా విషతుల్యం చేస్తున్నాయో చూసి వాటిని వివరిస్తూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. ఆ విజ్ఞప్తులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి?? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రాజమండ్రి వద్ద అఖండ గోదావరి నదీ కాలుష్యంపై ప్రస్తావనను శాసనసభలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు లేవనెత్తారు అంటేనే ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతోంది' అని ప్రస్తావించారు.


'ప్రభుత్వం కేవలం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. కాలుష్యాన్ని శాశ్వతంగా అరికట్టడానికి ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలి. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికైనా మేల్కొనాలి. కేవలం కార్యాలయాలకు పరిమితమైన తప్పుడు ల్యాబ్ రిపోర్టులపై కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకొని కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి.. ప్రభుత్వం పరిహారాలు చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుంది.


ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు! గోదావరిని కాపాడుకుందాం. కాలుష్య నివారణే మన ఆరోగ్యాన్ని కాపాడే తారక మంత్రం' అన్నారు సత్యనారాయణ.


ఆసక్తికరరంగా ఈ ఘటన జరగడానికి ముందురోజు బొలిశెట్టి సత్యనారాయణ ఓ ట్వీట్ చేశారు. 'గోదావరి నదీ కాలుష్యంపై శాసన సభలో అనపర్తి శాసన సభ్యులు (బీజేపీ)శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు చెప్పింది సత్యం..గతంలో నేను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు స్వయంగా వెళ్లి అక్కడ ఏపీ పేపర్ మిల్స్, రాజమండ్రి మునిసిపాలిటీ, ఆంధ్రా షుగర్స్ కాలుష్యాన్ని స్వయంగా చూసి గత ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశాం.. పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి ఇప్పుడు గోదావరి నది కాలుష్య నియంత్రణ జరిగితీరాలి ఇప్పుడు కాక పోతే మరెప్పటికీ కాదు' అంటూ మరో ట్వీట్ చేశారు. ఇవాళ చేసిన ట్వీట్‌లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. గోదావరి నది కాలుష్యానికి కల్తీ పాలు ఘటనకు ఆయన లింక్ చేశారు.

Latest News
US urges allies to share defence burden amid threats Wed, Mar 04, 2026, 12:08 PM
Holi meant to end disputes, promote unity, says BJP MP Ravi Kishan Wed, Mar 04, 2026, 12:04 PM
US senator flags H-1B visa abuse, DHS review underway Wed, Mar 04, 2026, 12:01 PM
India sets up control room as West Asia conflict intensifies Wed, Mar 04, 2026, 11:58 AM
Trump's Iran strike ignites Capitol Hill fight Wed, Mar 04, 2026, 11:53 AM