కేరళ రాష్ట్రం పేరు కేరళమ్‌‌ మార్పుకు కేంద్రం పచ్చజెండా
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:23 PM

దక్షిణాది రాష్ట్రం కేరళ తన అసలు పేరును తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తోంది. కేరళ అనే పేరును అధికారికంగా కేరళమ్‌గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ పంపిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.


ఏమిటీ వివాదం? పేరు ఎందుకు మారుస్తున్నారు?


మలయాళ భాషలో ఈ రాష్ట్రాన్ని పూర్వం నుంచే కేరళమ్‌ అని పిలుస్తారు. అయితే 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో దీనిని కేరళగా నమోదు చేశారు. బ్రిటీష్ పాలకులు తమ ఉచ్చారణ సౌలభ్యం కోసం మార్చిన ఈ పేరునే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.


అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిపై మాట్లాడుతూ.. "మా రాష్ట్రం పేరు మలయాళంలో కేరళమ్‌ మాత్రమే. ఇతర భాషల్లో మాత్రం కేరళగా పిలుస్తున్నారు. బ్రిటీషర్లు చేసిన ఈ మార్పును సరిదిద్ది, మా సంస్కృతికి అనుగుణంగా పేరు మార్చాలని కోరుతున్నాం" అని గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2023లో కేరళ అసెంబ్లీ ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.


రాజకీయ ఏకాభిప్రాయం.. రాజీవ్ చంద్రశేఖర్ మద్దతు


ఆశ్చర్యకరంగా రాష్ట్ర పేరు మార్పు విషయంలో పాలక ఎల్డీఎఫ్‌ కు.. ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్.. ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ఈ మార్పును సమర్థించారు. దీనిపై స్పందించిన సీఎం విజయన్.. రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవడంలో అందరూ కలిసి రావడం హర్షణీయమని పేర్కొన్నారు.


అసలు పేరు మార్పు ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?


కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత ఈ ప్రతిపాదన పార్లమెంటుకు చేరుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును మార్చడానికి బిల్లును ప్రవేశ పెట్టాలి. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో కేరళ స్థానంలో కేరళమ్‌ను చేర్చాలి. అలాగే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లోనూ ఈ మార్పును అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గనుక ఆమోదం తెలిపితే.. ఇకపై ప్రభుత్వ రికార్డులు, గెజిట్లు, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పేరు అధికారికంగా కేరళమ్‌‌గా దర్శనమివ్వనుంది.

Latest News
India can play key role as world's manufacturing partner: PM Modi Tue, Mar 03, 2026, 02:41 PM
4.3-magnitude quake hits Iran amid escalating Israeli offensive Tue, Mar 03, 2026, 02:30 PM
T20 WC: What will happen if SA vs NZ semi-final is washed out? Tue, Mar 03, 2026, 02:27 PM
Sindhu safely returns home after being stranded in Dubai for 3 days Tue, Mar 03, 2026, 12:58 PM
PM Modi surpasses 30 million YouTube subscribers, emerges as most followed global leader Tue, Mar 03, 2026, 12:55 PM