|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:26 PM
ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆశతో ఆకాశంలోకి ఎగిరిన ఆ ప్రయాణం విషాదాంతమైంది. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ సోమవారం రాత్రి చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భీకర ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, వైద్య సిబ్బందితో సహా మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
20 నిమిషాల్లోనే అంతా అయిపోయింది..!
రెడ్ బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన 'బీచ్‌క్రాఫ్ట్ సి90' (వీటీ-ఏజీవీ) విమానం సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అయితే రాత్రి 7.34 గంటల సమయంలో కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో విమానానికి రాడార్ సంబంధాలు తెగిపోయాయి. చత్రా జిల్లా బరియాతు పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలినట్లు జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధృవీకరించారు.
చనిపోయిన వారు వీరే..!
పోలీసులు వెలికితీసిన మృతదేహాలను.. పైలెట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్ (రోగి), డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడికల్ సిబ్బంది సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్‌లుగా గుర్తించారు. అయితే లాతేహార్ జిల్లాకు చెందిన 41 ఏళ్ల సంజయ్ కుమార్.. గత వారం 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని దేవ్‌కమల్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే రోగి తట్టుకోలేడని డాక్టర్లు హెచ్చరించడంతో.. కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. "రోడ్డు మార్గం వద్దు, విమానంలో తీసుకెళ్తేనే ప్రాణాలు దక్కుతాయని డాక్టర్ చెప్పారు. అందుకే విమానం ఏర్పాటు చేశాం.. కానీ టీవీలో విమానం కూలిపోయిందని వార్త చూసి షాక్ అయ్యాం" అని బాధితుడి బంధువు విజయ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదానికి కారణం అదేనా?
ప్రమాద సమయంలో చత్రా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దంతో విమానం కూలడం తాము చూశామన్నారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని రాంచీ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాలు విచారణ ప్రారంభించాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2018లో స్థాపించబడిన రెడ్ బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానాలలో ఇది కూడా ఒకటి.
Latest News