|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:19 PM
పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని, కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరుమెదపడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన డిమాండ్ చేశారు. 1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని చంద్రబాబు చెప్పుకునే రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్ 120 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పెద్ద జలాశయంగా మారింది. తాజాగా ఈ డ్యామ్ ఎత్తును 524.24 మీటర్లకు పెంచి అదనంగా మరో 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళికలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అనేక అంశాలపై గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత భవిష్యత్‌పై భయం నెలకొంది అని తెలిపారు.
Latest News