|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:26 PM
కల్తీ పాల ఘటనలో బాధితుల తరఫున వైయస్ఆర్‌సీపీ వేగంగా స్పందించి, గట్టిగా నిలబడి పోరాడింది కాబట్టే, ప్రభుత్వంలో కాస్తో కూస్తో చలనం వచ్చిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వం నగరంలో కల్తీ పాల బాధితులను అస్సలు పట్టించుకునేది కాదని ఆయన తేల్చి చెప్పారు. కల్తీ పాల మృతుల కుటుంబాలకు ఇప్పుడు ప్రకటించిన పరిహారం సరికాదని, వారికి రూ.25 లక్షల చొప్పున అందజేయాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది. అందుకే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్పెషలిస్టుల నియామకాలు చేయాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయడం లేదు. మరోవైపు కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సహాయం అందలేదన్న కారణం సాకుగా చూపి, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి, చేతులు దులిపేసుకోవడం హేయం అని మండిపడ్డారు.
Latest News