|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:00 PM
రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఇంటి నుంచే సులభంగా పన్నులు చెల్లించవచ్చు. ఈ కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి గోడకు లేదా డోర్‌కు ఈ క్యూఆర్ కోడ్‌ను అంటించనున్నారు. పౌరులు తమ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే, ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇంటి విస్తీర్ణం, ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం, ఏవైనా బకాయిలు ఉంటే ఆ వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలను కూడా దీని ద్వారా తెలుసుకుని చెల్లించవచ్చు.
Latest News