|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 08:45 PM
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ వారసత్వం, చారిత్రక కట్టడాల స్ఫూర్తితో సరికొత్త లోగోను రూపొందించింది యాజమాన్యం.శుక్రవారం ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఎరుపు నేపథ్యంపై నీలం రంగు నిలువు గీతలతో, గరుడుడు, కిరీటం, ఏనుగు చిహ్నాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన జెర్సీ వీడియోను ఫ్రాంచైజీ తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్, ఎడెన్ మర్క్‌రమ్, పేసర్ మహమ్మద్ షమీ కొత్త జెర్సీని ధరించి అభిమానులను ఆకట్టుకున్నారు.ఐపీఎల్ 19వ సీజన్‌లో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ సారి కొత్త జెర్సీతో ప్రత్యేకంగా కనిపించనుంది. లక్నో నగర చరిత్ర, ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. వారణాసిలో గంగానది ఒడ్డున జరిగే మహా హారతి నుంచి వెలువడే ధూపపు కాంతి, తాజ్ మహల్ తేజస్సు, ఆగ్రాకోట వైభవం, గంగా జలాల ప్రవాహం — ఈ అంశాల సమ్మేళనంగా జెర్సీ రంగులు, ఆకృతులు రూపొందించారు. లోగోలో గరుడుడు, కిరీటం, ఏనుగు చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
*విశిష్టతను, స్ఫూర్తిని ప్రతిబింబించే లోగో : ఉత్తరప్రదేశ్, లక్నో ప్రత్యేకతను చాటేలా అభిమానులకు చేరువయ్యే విధంగా కొత్త లోగోను రూపొందించారు. లోగోలో శక్తివంతమైన గరుడుడు ధైర్యానికి ప్రతీక. సవాళ్లను స్వీకరించడం, వెనుకడుగు వేయకపోవడం, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని అది సూచిస్తుంది. లక్నో జట్టు ఆడే నిర్భయమైన క్రికెట్ శైలికి ఇది చిహ్నంగా నిలుస్తుంది.కిరీటం గౌరవం, బాధ్యతకు సంకేతం. మైదానంలోకి దిగిన ప్రతీసారి లక్షలాది అభిమానుల ఆశలను మోసే జట్టుకు ఇది గుర్తింపు. లక్నో జెర్సీ ధరించడం గర్వకారణమని, ప్రతి మ్యాచ్‌లో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే సంకల్పాన్ని కిరీటం తెలియజేస్తుంది.ఏనుగు చిహ్నం బలం, తెలివి, ఓర్పు, ఐక్యతకు ప్రతిరూపం. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి సీజన్‌లో అభిమానులు అందిస్తున్న అండదండలను ఇది సూచిస్తుంది. లక్నో వీధుల సంస్కృతి, కుటుంబాల అనుబంధం, ఒకరోజు లక్నో జెర్సీ ధరించాలని కలలు కనే యువత ఆకాంక్షలకు ఈ లోగో ప్రతిబింబంగా నిలుస్తుంది.