|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 09:04 PM
మరో రెండు రోజుల్లో మార్చి నెల ప్రారంభం కానుంది. కొత్త నెల రాగానే ప్రజలపై ప్రభావం చూపే కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. అందుకే ముందుగానే వాటిపై స్పష్టత ఉండటం అవసరం.మార్చి 1 నుంచి WhatsApp, Telegram వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇకపై మీ ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే ఈ యాప్స్ ఉపయోగించలేరు.సిమ్ కార్డ్ బైండింగ్ విధానం ప్రకారం, యాప్ ఉపయోగిస్తున్న మొబైల్‌లోనే సిమ్ ఉండాలి. లేకపోతే వాట్సప్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుంది. ఇప్పటివరకు ఒక ఫోన్‌లో సిమ్ ఉంచి, మరో ఫోన్‌లో వాట్సప్ ఉపయోగించే అవకాశం ఉండేది. అయితే కొత్త నియమాలతో ఆ సౌకర్యం రద్దు కానుంది.కేంద్ర టెలికాం విభాగం ఈ సిమ్ బైండింగ్ నిబంధనను తప్పనిసరి చేసింది. సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లోనే ఈ విషయాన్ని ప్రకటించి, అమలుకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చారు. ఆ గడువు ముగియడంతో మార్చి 1 నుంచి ఈ నియమం అమల్లోకి రానుంది.ఇకపై వాట్సప్ వాడాలంటే ఫోన్‌లో సిమ్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. సిమ్ తొలగిస్తే యాప్ పనిచేయదు. అదేవిధంగా వాట్సప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుందని సమాచారం. మళ్లీ ఉపయోగించాలంటే సిమ్ కార్డ్‌ను ఫోన్‌లో పెట్టి తిరిగి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలో మాత్రమే సిమ్ ధృవీకరణ అవసరం అవుతోంది. ఒకసారి వెరిఫికేషన్ పూర్తయ్యాక సిమ్ లేకపోయినా యాప్స్ పనిచేస్తున్నాయి. ఈ లోపాన్ని ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. కొత్త సిమ్ బైండింగ్ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
Latest News