|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:31 PM
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిపై ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను హత్య చేశారు. నిందితుల్లో ఒకరు ఆమె ప్రియుడు కాగా, మరొకరు సాయం చేస్తానని నమ్మించిన అపరిచితుడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ అంకిత్ కుమార్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ నెల 22న ఈ దారుణం జరిగింది. బాధితురాలి ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆలయానికి రమ్మని పిలిచాడు. అతనితో కలిసి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఆమెను, అతను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, రహమా బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. బస్టాండ్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్న యువతిని చూసిన ఝార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి, పారాదీప్‌కు బైక్‌పై వెళ్తూ ఆమెకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. అయితే, అతను ఆమెను పారాదీప్ పట్టణంలోని తాను అద్దెకు ఉంటున్న ఇంటి నాలుగో అంతస్తుపైకి తీసుకెళ్లి, మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను భవనం పైనుంచి కిందకు తోసేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.ఈ నెల 22న సాయంత్రం యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు టిర్టోల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. మరుసటి రోజు మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం 25న తన సోదరిపై అత్యాచారం జరిపి హత్య చేశారని ఆరోపిస్తూ బాధితురాలి సోదరుడు పారాదీప్ మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Latest News