తమిళనాట ఏపీ 2009 రిపీట్..విజయ్, ఓపీఎస్, శశికళ.. స్టాలిన్‌కు సానుకూల సంకేతాలు
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:26 PM

అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంతో కాలంగా అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్య పోరు ఉండగా.. ఇప్పుడు విజయ్‌కి చెందిన టీవీకే సైతం పోటీలోకి వచ్చింది. దీంతో త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. స్టాలిన్ సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటారా? లేదా అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందా? విజయ్ కింగ్ మేకర్ అవుతారా? అనేది తమిళనాడు ప్రజలకే కాకుండా దక్షిణాది మొత్తానికి ఆసక్తి కలిగిస్తోంది.


 అయితే అధికారంలో ఉన్న డీఎంకేకి పరిస్థితులు అనుకూలంగా ఉన్న సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నుంచి బయటకొచ్చిన పన్నీరు సెల్వం డీఎంకేలో చేరారు. జయలలితకు నమ్మిన బంటు అయిన ఓపీఎస్.. గతంలో తమిళనాడు సీఎంగానూ పని చేశారు. అయితే పళనిస్వామితో పొసగకపోవడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించగా.. అన్నాడీఎంకేకు బద్ధశత్రువైన డీఎంకే గూటికి చేరారు.


జయలలిత సన్నిహితురాలైన శశికళ సైతం సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జయలలిత చనిపోయాక ఆమె సీఎం అవుతారని భావించారంతా. అయితే అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో పన్నీరు సెల్వంకు అధికారం దక్కొద్దనే భావనతో ఆమె పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఈపీఎస్, ఓపీఎస్ ఒక్కటై శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు శశికళ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే అన్నాడీఎంకేకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చిన్నమ్మ ప్రభావం ఎన్నికలపై ఎంత వరకు ఉంటుందనేది చూడాలి. ఆమె ప్రభావం ఎంతగా ఉంటే.. డీఎంకేకు అంత కలిసి వస్తుంది.


ఇక తమిళనాడు ఎన్నికల్లో కీలకమైన ఫ్యాక్టర్ హీర్ విజయ్ నాయకత్వంలోని టీవీకే. విజయ్‌కి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఎన్నికలు తనకు, స్టాలిన్‌కు మధ్య పోరు అని విజయ్ ప్రకటించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన సొంతంగా అధికారంలోకి రావడం కష్టం, అయితే ఆయన పార్టీ ఎంత మేర ఓట్లు చీల్చుతుంది అనేదానిపై ప్రత్యర్థి పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. 20 శాతం వరకు ఓటు బ్యాంక్ ఉండొచ్చని భావిస్తోన్న విజయ్ పార్టీ కింగ్ మేకర్‌ అవుతుందా? లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా డీఎంకే విజయానికి పరోక్షంగా సహకరిస్తుందా అనేది చూడాలి.


అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు అన్బుమణి రామ్ దాస్ వర్గానికి చెందిన పీఎంకే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అయితే అన్నాడీఎంకేతో గతంలో కలిసి పని చేసిన డీఎండీకే అనూహ్యంగా డీఎంకే గూటికి చేరింది. దివంగత విజయ్‌కాంత్ భార్య ప్రేమలత ఈ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఓపీఎస్ సైతం డీఎంకేలో చేరారు. కాంగ్రెస్, వీసీకే, కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్‌తోపాటు లెఫ్ట్ పార్టీలు డీఎంకేతో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకం విషయమై కొద్దిగా పొరపొచ్చాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


స్థూలంగా చూస్తే.. ఓపీఎస్ తన వైపు చేరడంతోపాటు.. విజయ్, శశికళ రూపంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌కు గండిపడే అవకాశం కనిపిస్తోంది. అదీగాక తమిళ తంబీలను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ ఇప్పటికీ ఆశించినంత సక్సెస్ కావడం లేదు. అన్నాడీఎంకే గెలిస్తే బీజేపీ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటుందనే భయం కూడా తమిళుల్లో ఉంది. ఇవన్నీ కలిసి స్టాలిన్ వరుసగా రెండోసారి సీఎం కావడానికి లైన్ క్లియర్ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే, 2009లో ఏపీలో వైఎస్ ఎలా అధికారంలోకి రాగలిగారో ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ అలాంటి సీన్ రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట.

Latest News
Dr Rajendra Prasad remembered on his 63rd death anniversary; CM Nitish pays floral tribute Sat, Feb 28, 2026, 03:21 PM
CM Gupta launches HPV vaccination drive; Delhi aims to vaccinate 1.6 lakh girls in three months Sat, Feb 28, 2026, 03:11 PM
AGuH adopts stealth strategy: Expands in North, lies low in J&K Sat, Feb 28, 2026, 02:42 PM
India vs West Indies head-to-head record and last five matches performance Sat, Feb 28, 2026, 02:38 PM
India urges nationals in Israel to stay alert after Israel US strikes on Iran Sat, Feb 28, 2026, 02:31 PM