|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 01:19 PM
కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్ ఫొటోలతో కించపర్చారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్‌ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఆయన మెడకే చుట్టుకుందని, ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు చంద్రబాబు టీటీడీ నిధులు దోచిపెట్టిన వైనం ఆధారాలతో సహా బయటకొచ్చిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా.. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్న వైయస్ఆర్‌సీపీసోషల్ మీడియాను నిలువరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు.
Latest News