నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 17 మంది మృతి
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:47 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కటోల్ ప్రాంతంలోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతినడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నిద్రలోనే కబళించిన మృత్యువు


పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఎస్‌బీఎల్ ఎనర్జీ యూనిట్‌లో తెల్లవారుజామున కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్లో సుమారు 30 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సమీప గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని భయాందోళనలకు గురయ్యారు. ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, మంటలు ఎగసిపడటంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు.


దీంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓవైపు మంటలు ఆర్పుతూనే.. మరోవైపు ఫ్యాక్టరీలో ఉన్న మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. గాయపడిన 18 మందిని నాగ్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రులకు పంపించారు. అలాగే చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.


ప్రమాదానికి కారణం ఏమయ్యుంటుంది?


ఎస్‌బీఎల్ ఎనర్జీ పరిశ్రమలో ప్రధానంగా డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పరిశోధనలకు వాడే పేలుడు పదార్థాలను తయారు చేస్తారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన యూనిట్‌లో సాంకేతిక లోపం వల్ల లేదా అజాగ్రత్త వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ముఖ్యంగా సరైన కారణం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మరోవైపు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Latest News
MP LoP slams state govt over agriculture policy Mon, Mar 02, 2026, 04:50 PM
Kuwait confirms several US military aircraft crashed, all crew safe Mon, Mar 02, 2026, 04:05 PM
T20 WC: When and where to watch India vs England semifinal Mon, Mar 02, 2026, 03:44 PM
India, Canada decide to establish defence dialogue, says PM Modi Mon, Mar 02, 2026, 03:10 PM
Nepal: PM Karki calls voters to actively participate in March 5 elections Mon, Mar 02, 2026, 03:06 PM